Friday, June 25, 2010

బ్లాగులో కామెంట్లు డిలీట్ చేయాలా??

మీ బ్లాగులో ప్రచార, అనవసర, అసభ్యకరమైన , అభ్యంతరకరమైన కామెంట్లు వస్తున్నాయా?? దానికోసం ప్రతీ బ్లాగరు మాడరేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా అంటారా?? అవసరం లేదంటాను. మనకు ఇష్టం లేని కామెంట్లు చాలా సులువుగా తీసేయొచ్చు. ఇదిగో ఇలా ...



మీ బ్లాగులో వచ్చిన కామెంట్లు డిలీట్ చేయాలంటే ముందుగా మీ బ్లాగులోకి లాగిన్ అవ్వాలి. తర్వాత మీరు తీసేయాలనుకున్న కామెంట్ పక్కన చిన్న బాక్స్ లాంటిది కనిపిస్తుంది . అది క్లిక్ చేయండి.




పైన చిత్రంలో లా కన్పిస్తుంది. డిలీట్ కామెంట్ అంటే కామెంట్ పోతుంది కాని ఆ కామెంట్ రాసినవారి పేరు మీ బ్లాగులో ఉంటుంది. అలా కాకుండా ఆ కామెంట్ మొత్తాన్ని తీసేయాలంటే Remove forever అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కామెంట్ ని డిలీట్ చేయండి. అంటే ఆ కామెంట్ పూర్తిగా మాయమవుతుంది.


ఇక మీరు వేరే బ్లాగులో రాసిన కామెంట్ తీసేయాలనుకుంటే ఇదే విధంగా కామెంట్ కింద కనిపించే చిన్ని బాక్స్ ని క్లిక్ చేసి కామెంట్ తీసేయండి. మీరు రాసిన కామెంట్ పోయినా మీ పేరు మాత్రం ఉంటుంది. అది ఆ బ్లాగు ఓనర్ మాత్రమే తీసేయాలి పైన చెప్పినట్టుగానే.. ఆ హక్కులన్నీ ఆ బ్లాగ్ ఓనర్ కే ఉన్నాయి ఏ కామెంట్ తన బ్లాగులో ఉండాలో, ఉండకూడదో. ..

ఎంజాయ్...

Sunday, June 13, 2010

హారం - తెలుగు బ్లాగుల అగ్రిగేటర్



తెలుగు బ్లాగులను ఒక చోట చేర్చి వాటి విశేషాలను మనకు అందించే మరో అగ్రిగేటర్ హారం. భాస్కర్ రామిరెడ్డి నిర్వహిస్తున్న ఈ హారం ఎన్నో ప్రత్యేకతలతో మనను అలరిస్తుంది. ఇటీవల మరిన్ని హంగులతో మనముందుకు వచ్చింది.

హారంలోని వివిధ విభాగాల గురించి తెలుసుకుందాం. హారం మొదటి పేజిలో ఎడమ వైపు భాగంలో రచయితల పేర్లు వారు వ్రాసిన వ్యాసాలు లేదా వ్యాఖ్యల కోసం వినియోగించడం జరిగింది. మధ్య భాగంలో రచయితల వ్యాసాలు, లేదా వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు చూపబడతాయి. కుడి భాగంలో హారం చేసే రకరకాల విశ్లేషణలు చూపబడతాయి.



హారంలో మరిన్ని సదుపాయాలు పొందుపరచడమైనది. అందులో కొన్ని

1) గతవారం రోజుల్లో ఎక్కువగా ఏబ్లాగులు పాఠకులు చదివారో చూపిస్తుంది. ఈ టపాల/వ్యాసాల పట్టిక రోజుకొక సారి మాత్రమే మారు తుంది.
2)అలాగే తక్కువగా వీక్షించిన వ్యాసాలను కూడా క్రోడీకరించి సముచిత స్థానం ఇవ్వడం జరిగింది. ఇదికూడా రోజుకొక్కసారే మారుతుంది.
3) అంతర్జాల పత్రికలలో వచ్చిన వ్యాసాలను పదిహేను రోజుల పాటు హోమ్ పేజీలో చూడొచ్చు. అంటే చందమామ,జ్యోతి,స్వాతి,భూమి లాంటి పత్రికలు కూడా ఉంటాయి.
4) పద్య, సాహిత్య ,వార్తా బ్లాగులను అలాగే కవితా బ్లాగులను విడిగా చూపడమైనది.
5) వివిధ విభాగాల్లో వ్రాసిన వ్యాసాలను కూడా క్రోడీకరించి [సాధ్యమైనంత తప్పులు లేకుండా ] చూపడానికి కూడా అనువుగా హోమ్ పేజీని డిజైన్ చేయడమైంది. కుడివైపు ఇచ్చిన ఆప్షన్ లో మీకు కావలసిన విభాగంలోని బ్లాగులు చూడవచ్చు. అంటే మీరు చాలా సులభంగా పద్యాలను, పాటలను, సంగీతపు వ్యాసాలను, హాస్య/వ్యంగ్య వ్యాసాలను, సాంకేతిక వ్యాసాలను చదువుకోవచ్చు.
6) కామెంట్ల పేజీలో ప్రత్యేకించి పాటల టపాలను చూపించడం జరిగింది.
7) హారంలో బ్లాగు టపాలే కాక ప్రతిబ్లాగులోని వ్యాఖ్యలు కూడా వేరే పేజిలో తెరిచి చదువుకోవచ్చు. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.